విశాఖలో 3 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: ఎంపీ శ్రీభరత్

  • రూ. 1,501 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు శ్రీభరత్ వెల్లడి
  • అత్యాధునిక అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌, స్మార్ట్ తాగునీటి సరఫరా, బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫర్ ప్రాజెక్టులు
  • ఈ ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న భరత్

విశాఖపట్నం నగర మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం మూడు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపినట్లు విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్‌ వెల్లడించారు.


మొత్తం రూ.1,501.03 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నగరంలో చేపట్టనున్నారు. ఈ మొత్తం వ్యయంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు రూ.375.26 కోట్ల గ్రాంట్ (25 శాతం) లభించనుండగా, మిగిలిన నిధులను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకుల ద్వారా సమకూర్చుకోనున్నారు.


ఈ భారీ నిధులతో నగరంలో వేగంగా విస్తరిస్తున్న మధురవాడ జోన్ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ఇందులో భాగంగా మధురవాడ జోన్ పరిధిలో అత్యాధునిక అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.658.61 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, అదే జోన్‌ పరిధిలోని సుమారు 65 వేల నివాసాలకు నిరంతరాయంగా, సురక్షితమైన తాగునీటిని అందించే స్మార్ట్ తాగునీటి సరఫరా ప్రాజెక్టు కోసం రూ.725.18 కోట్లను కేటాయించారు. 


వీటితో పాటు నగరం మొత్తానికి ప్రయోజనం చేకూర్చేలా బల్క్‌ అండ్‌ సెమీ బల్క్‌ నీటిసరఫరా వ్యవస్థ ఆధునికీకరణ కోసం రూ.117.24 కోట్లను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అత్యాధునిక స్కాడా (SCADA) సాంకేతికతను రంగంలోకి దించుతున్నారు. దీని ద్వారా నీటి వనరులు, శుద్ధి కర్మాగారాలు, పైప్‌లైన్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులను సెన్సార్ల సహాయంతో అనుసంధానించి, ఒకే కేంద్ర నియంత్రణ గది నుండి మొత్తం నీటి సరఫరాను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తారు. కేంద్రం ఆమోదించిన ఈ మూడు మెగా ప్రాజెక్టులు 2028 నాటికి అందుబాటులోకి వస్తే విశాఖ నగర మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు అద్భుతంగా మెరుగుపడతాయని ఎంపీ శ్రీభరత్ ధీమా వ్యక్తం చేశారు.


Sribharat
Visakhapatnam
Vizag
Andhra Pradesh
GVMC
Urban Challenge Fund
Underground Drainage
Drinking Water Supply
SCADA Technology
Infrastructure Development

More Telugu News